Gandhi Thatha Chettu Movie Review: "గాంధీ తాత చెట్టు" మూవీ రివ్యూ..! 1 y ago

featured-image

టైటిల్ : గాంధీ తాత చెట్టు

నటీనటులు : సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు

నిర్మాణ సంస్థలు : మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్

నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, శేష సింధురావు

రచన- దర్శకత్వం : పద్మావతి మల్లాది

సంగీతం : రీ

సినిమాటోగ్రాఫీ : శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవభత్తుల

విడుదల తేదీ : జనవరి 24, 2025

టాలీవుడ్  స్టార్‌ డైరెక్టర్ సుకుమార్‌ గారాల కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గాంధీ తాత చెట్టు'. ఇప్పటికే ఈ మూవీ పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు సాధించింది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందింది. ఇక ఇటీవల రిలీజైనా ట్రైలర్‌ ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. మూవీ ప్రమోషన్స్‌లో సుకుమార్‌ కూడా పాల్గొనడంతో ‘గాంధీ తాత చెట్టు’ మూవీ పై అంచనాలు పెరిగాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉంది? సుకుమార్‌ కూతురు డెబ్యూతోనే హిట్‌ కొట్టిందా లేదా రివ్యూలో చూద్దాం.

కథ ఏమిటంటే..

నిజామాబాద్‌ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన నాన్న నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ వేప చెట్టు అంటే అతనికి ప్రాణం. అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మినిస్టర్ చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు.

అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్‌(రాగ్‌ మయూర్‌) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ. దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ 10 ఏళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని, ఓ చెట్టుని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేదే ఈ మూవీ కథ. టైటిల్‌ కు తగ్గట్టే ఈ మూవీ కథంతా గాంధీ, తాత, చెట్టు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. డైరెక్టర్ పద్మావతి మల్లాదిఎంచుకున్న పాయింట్‌ బాగుంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని చాలా జన్యూన్‌గానే ఇచ్చింది. అయితే సందేశం బాగున్నప్పటికీ లాగ్ చేసి  చెప్పినట్లుగా తెలుస్తోంది. మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ.. అహింసావాదం గొప్పతనాన్ని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారు. చెట్టును రక్షించేందుకు గాంధీ చేసే ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటాయి. కానీ వాస్తవికానికి కాస్త భిన్నంగా ఉంటుంది.

 ఎలాంటి సాగదీత లేకుండా మూవీ ప్రారంభంలోనే తాత, గాంధీ పాత్రలను పరిచయం చేసి.. అసలు కథను ప్రారంభించారు. ఒకపక్క గాంధీ జర్నీని చూపిస్తూనే..మరోపక్క తాత, చెట్టుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించారు. మహాత్మా గాంధీని ఈ కథలో ముడిపెట్టిన విధానం బాగుంది. తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు విని తెలియకుండానే మన కళ్లు చెమ్మగిల్లుతాయి.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌ గా సాగినప్పటికీ.. సెకండాఫ్‌ మాత్రం కాస్త లాగ్ చేసినట్లుగా అనిపిస్తుంది. అలాగే కథనం మొత్తం ఎలాంటి మలుపులు, ట్విస్టులు లేకుండా ఊహకు అందినట్లే సాగుతుంది. ‘నువ్వు ఒక్క మొక్క అయినా నాటావా? చెట్టును నరికే హక్కు ఎవరిచ్చారు? నువ్వు పీల్చుకున్న గాలి ఎవరో పెంచిన మొక్కల నుంచి వచ్చిందే కానీ..నువ్వు సంపాదించుకున్నది ఏమి లేదంటూ బిజినెస్‌ మ్యాన్‌తో తాత చెబుతుంతుంటే.. ‘నిజమే కదా.. మనం కూడా చెట్లను పెంచలేదు. ఒక్కటైనా పెంచుదాం’ అనే ఆలోచన కొంతమందికి అయినా వస్తుంది.

‘ఏదైనా ప్రేమతో గెలవాలంటే కాస్త టైం పడుతుంది’, ‘చెడుని దులిపేయాలి...మంచిని పట్టుకోవాలి’, ‘పంట పండే స్థలాన్ని అమ్మడం అంటే కన్న తల్లిని వ్యభిచారానికి పంపించినట్లే’ అంటూ తాత చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏమేరకు సక్సెస్‌ అవుతుందో తెలియదు కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం అందించింది.

 

ఎవరెలా నటించారంటే..

స్టార్ డైరెక్ట‌ర్‌ సుకుమార్‌ గారాల కూతురు సుకృతి వేణి నటించిన డెబ్యూ సినిమా ఇది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో అందరికి ఆకట్టుకుంది. గాంధీ పాత్రలో ఆమె జీవించేసింది. ఈ పాత్ర కోసం నిజంగానే సుకృతి గుండు గీసుకుంది అంటే.. ఎంత ఇష్టపడి నటించిందో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్‌ సీన్లలోనూ చక్కగా నటించింది.

ఇక తాత రామచంద్రయ్య పాత్రకి ఆనంద్‌ చక్రపాణి పూర్తి న్యాయం చేశాడు. బిజినెస్‌ మ్యాన్‌ సతీష్‌గా రాగ్‌ మయూర్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గాంధీ తండ్రితో పాటు మిగిలిన నటీనటులంతా కొత్తవారే అయినప్పటికీ వారి వారి పాత్రలకుతగినట్టు చక్కగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన పాటలలో పాటు నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ ఇంకాస్త శ్రద్ధపెట్టి పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను ఇంకాస్త క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD